Monday, December 6, 2010

కుటుంబంలోకి కొత్త సభ్యురాలు


కుటుంబంలోకి కొత్త సభ్యురాలు


Scene - 1

 

యథావిధిగా కొన్ని వీధుల్లోని ప్రతీ లోగిలిలో లాగా ఇప్పుడు మనం తొంగి చూడబోతున్న లోగిలిలో కూడా "కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా.." వినపడుతోంది. 

మన కథానాయిక.. కి యజమానురాలు అయిన చిట్టికి తల్లి వెంకటలక్ష్మీ హడావుడిగా వంటింట్లో నుండి వచ్చి అరుస్తోంది..

లక్ష్మీ: ఆపు! ఆపవే ఆపు!!

చిట్టి: ఏంటమ్మా నువ్వు?! చక్కగా సుప్రభాతం వస్తుంటే ఆపమని పిల్లలపై అరిచే అమ్మని నిన్నే చూస్తున్నా. (చింపిరిజుట్టుని పిచ్చిపిచ్చిగా బరుకుతూ విసుక్కుంటుంది)

ల: సుప్రభాతమే!? ఇప్పటికో 100 సర్లు అరిచుంటుంది ఐదు పేర్లని.

ఇంతలో మళ్ళీ “కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్య..” వినపడింది.

ల: దీన్ని ఏమంటారే? కాస్త కళ్ళు తెరిచి విను, చెవులు పెట్టి చూడు.

చి: ఓస్ అదా! అదీ.. నా ఫోన్ లో అలారం పెట్టానమ్మా. సుప్రభాతంతో..

ల: అది సుప్రభాతం కాదు పదే పదే అదే పేర్ల దండకం.

(చేతిలో గరిటె చిట్టి మీదకు విసురుతుంది. తప్పించుకుంటూ ఓ వెర్రి నవ్వు విసిరి బాత్రూంలోకి పరుగు తీస్తుంది చిట్టి)

 

ఇల్లు అన్నాక ప్రహరీ గోడ, దాని మీద ఆతృతగల పక్కింటి ఆంటీ కనపడటం సహజం. ఇక్కడా అంతే.

కూతురుపై విజయ గర్వంతో లక్ష్మీ నవ్వుకుంటూ గరిటె తీసుకుని వాకిలి లోకి వస్తుంది. పక్కింటి వాసంతి విలేఖరిలా చేతిలో మైకులాగా గరిటె పట్టుకుని చెవులు రిక్కించి వినే భంగిమలో కనిపించింది.

ఏంటి? అన్నట్లు తల ఎగరేసింది లక్ష్మీ.

వాసంతి: ఏంలేదు వదినా! మీ పాప సుప్రభాతం పడుతుంటేనూ వింటూ ఉండిపోయా.. ఎంత పద్ధతో!

(అని వెటకారాలు ఆడుతుంది)

మరే వదినా, మా పిల్లకి చిన్నప్పటి నుండే భక్తి ఎక్కువ. భరించలేనంత భక్తి.. సుప్రభాతం ప్రాక్టీసు చేస్తోంది.

వా: ఆ! ఆదేలే నేను అదే అనుకున్నా. సరే వదినా కుక్కర్ అప్పుడే మూడో కూత కట్టింది. దించేసొస్తా. (అంటూ..) "ఎంత ఫోన్ అయితే మాత్రం ఇలా అందరికీ వినపడేట్టు గోల చేయాలేవి(టి చోద్యం కాకపోతునూ. అంతేలే మనకీ విషయాలు తెలవాలిగా!”

(తనలో తాను గొణుక్కుంటూ మూతి 33 వంకర్లు తిప్పుకుంటూ లోనికి వెళిపోతోంది)

ల: ఏవే(! పొద్దస్తామానూ ఆ సెల్లు ఫోనులోసొల్లు కబుర్లు చెప్పకపోతే, కాస్త నా పనిలో సాయం పట్టచ్చు కదమ్మా.

చి: ఏంటీ, సొల్లు కబుర్లా!   పక్కింటి ఆంటీ ఉదయం మంచినీళ్లు వచ్చినప్పటి నుంచి సాయంత్రం అంకుల్ ఇంటికి వచ్చేదాకా చెప్తుందే? అవి సొల్లు కబుర్లు.

ల: సర్లే ఏదో ఒకటి అఘోరించు, కానీ కనీసం ఆ స్పీకర్ ఆన్ చేయకుండా మాట్లాడు. అక్కడ నువ్ మాట్లాడే ప్రతీ అక్షరానికి ఇక్కడ ఈవిడకి సారాంశాలు చెప్పలేక చస్తున్నా!

డైనింగ్ టేబుల్ పై భోజనానికి సర్దుతూ కూతుర్ని పిలుస్తుంది లక్ష్మీ.

ల: రామ్మా భోంచేద్దువు గానీ!

కూతురు సెల్ ఫోన్లో మాట్లాడుతూ భోజనానికి కూర్చుంటుంది.

ల: ఏమ్మా! కనీసం ఈ ఒక్క చోటైనా నీ నోటికి డబుల్ డ్యూటీ ఇవ్వకుండా ఉండచ్చు కదా. పోనీ నీ నోటికి కాకపోతే ఆ ఫోనుకైనా రెస్టు ఇవ్వవే కాసేపు!

చి: ఉండమ్మా, చాలా ఇంపార్టంట్ విషయం డిస్కస్ చేస్తున్నాం.

ల: ఏవి(టో అది?

చి: అదే మన జూలు ఉంది కదా..

ల: జూలు ఏంటే? ఎవరి జూలు? జుట్టంటారు దాన్ని. నీ తెలుగుకి తెగులు పడుతోంది.

చి: జూలు కాదు.. జూ. లు. అంటే జూలీ లూయి అనే హాలీవుడ్ హీరోయిన్. 4వ సారి మూడో పెళ్లి చేసుకుంటుందట. గ్రేట్ కదా?

ల: హావ్వ! చాల్లే నోర్మూయ్! ఇదేనటే నువ్ చెప్పే ఇంపార్టంట్ విషయం. అసలు నిన్ను కాదు నీకా సెల్ ఫోన్ కొనిచ్చిన మీ డాడీని అనాలి. ఇలాంటి పనికిమాలిన సొల్లుకి ఫోన్ బిల్లుతో ఆయన జేబుకి చిల్లు పెడుతున్నావ్. ఆయనకి తెలిస్తే ఉంటది.

చి: కమాన్ మమ్మీ, డాడీకి పొద్దున చెప్తే, “హ్మ్! అందరికీ అంతటి అదృష్టం ఎక్కడిదీ” అనుకుంటూ వెళ్లిపోయారు మరి! ( అని నవ్వుకుంటుంది)

ల: సరే సరే, ఇకిలించింది చాలు, త్వరగా భోంచేసి వెళ్ళి చదువుకో.

చి: ఉండమ్మా, జూలీ లూయ్..  

ల: ఇంకా నోరు మూయ్. (అనుకుంటూ లోనికి వెళ్ళిపోతుంది)

కూతురు మాత్రం ఫోన్  పట్టుకుని “అవునా! అలాగా.., కదా, తన డ్రెస్ మరీ పెద్దగా ఉందే! ఇంకొంచెం తగ్గిస్తే రాఖీ సావంత్ నే బీట్ చేసేది.” ఇలా కాబుర్ల మధ్య భోంచేస్తూ ఉంటుంది.

*******

Scene-2

రెండో రోజు కూరలు అమ్మే మనిషి బుజ్జమ్మ గుమ్మంలోకి వస్తుంది. గంప దింపుతూ “కూరలమ్మా!”

ల: తోటకూర ఎలా ఇచ్చేవూ? రూపాయికి రెండు కట్టలేగా?

బుజ్జి: అఆ!.. కట్ట రెండ్రూపాయ్లండే!

ల: ఆ! కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి అంటే నిన్నే చూసి అనుంటారు.

బు: అదేంటమ్మగోరు అట్టా అనీశారు.అట్టయితే సందు సివరనున్న కొట్టు కాడకెల్లండే. రూపాయ తక్కుకే దొరుకుతాది.

ల: “యేం! ఆ కొట్టూ నీదేనా?”, అంటూ కూరలేరుతుంది.

బు: కాదండే నా పెనివిటి సూస్కుంటాడండే.

(ఇంతలో, “తోటకూర, గోంగూర, కరేపాకూ..” రింగ్ టోన్ వినబడింది, గంపలో నుండి సెల్ ఫోన్ తీసి మాట్లాడుతుంది)

బు: వల్లో! ఏటి మావా! బజార్కెల్తున్నావా? అట్నేగానీ కొట్లో బుడ్డోడ్ని కూకోపెట్టెల్లు. నానొచ్చెతన్నా.

ల: ఓసి నీ చోద్యం గూలా!  బాగానే ఉంది మీ పని. సెల్ కూడానా?

బు: కుదరదండే! ఇది లేకపోతే పనెట్టా జరిగిద్దండే! ఉండాల్సిందేనండే!

ల: బాగానే ఉంది.

(ఇంతలో వాసంతి అక్కడికి వస్తుంది)

వా: మరే! నీ పనే బాగుందే, నెత్తిన గంప, చేతిలో ఫోను.

బు: హ్మ్! నా పనే బాగుండి ఉన్నా మీ లాటోల్లు సెయ్యలేరు గదమ్మా. మరేనండే ఒక్క అవుడియా మీ జీవితానే మార్సేతాది కదండే. (సెల్లు చూపించుకుంటూ, కూరలమ్మా అని అరుచుకుంటూ వెళ్లిపోబోతూ వెనుకకి తిరిగి..)

రేపిట్నించి మిస్సూడు కాలు ఇయ్యండొమ్మగోరు. నాను కూర్లట్టుకొచ్చేత్తాను.

వా: ఓయమ్మో! (అని గడ్డం కింద చేయి పెట్టి నోరెళ్ళబెట్టి చూస్తుంది.)

ల: ఇదేదో బాగానే ఉందే!. సరే నీ ఫోన్ నంబరు చెప్పు. రాసుకుంటాను!

బు: ఎందుకండే వొమ్మాయిగోరి నెంబరు సెప్పండే, మిస్సుడు కాలిత్తాను, నా పేరు మీది సేవు సేద్దురుగాని. వొమ్మాయిగోరు నా పేరు “ఎజ్జి బుజ్జి” అని రాస్కోండే.

ల: ఆదేవిటీ!

బు: ఎజిటేబుల్స్ బుజ్జమ్మండే, సిన్నగా ఎజ్జిబుజ్జి అనండే.

వా: ఏవిటో వదినా, కలి కాలం.. ఆహా సెల్లు కాలం.

*****

Scene- 3

 చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఏదో మాట్లాడుతూ పుస్తకం తిరగేస్తూ ఉంటుంది కూతురు శిరీష. తల్లి పిలుస్తూ బయటకి వస్తుంది. కూతురు విన్పించుకోకుండా మాటల్లో మునిగి కనపడుతుంది. అప్పుడు..

ల: అమా.. అమ్మాయి నిన్నే!

(కూతురు వినిపించుకోదు)

ల: చిట్టీ వింటున్నావా?

(అయినా బదుల్లేదు కూతురునుంచి)

ల: ఒసేయ్ వినబడిందా ఇందాకట్నుంచి పిలుస్తున్నా.

శి: అమ్మా.. అరిచావేంటి?

ల: లేదమ్మా అరవలేదు, పిలిచాను. అంత మర్యాదగా సున్నితంగా పిలిస్తే గానీ వినబడలేదు తమకి. కొత్త పిచ్చోడు పోద్దెరగడూ అని.. ఎప్పుడూ ఆ ఫోన్ లోనేనా, మామూలుగా మాట్లాడలేవా? అసలు మీ నాన్నని అనాలి ఆ సెల్ ఫోన్ కొనిచ్చినందుకు.

శి: డాడీనేమనకు, త్వరలోనే  నీకూ ఒక సెల్ ఫోన్ వచ్చేస్తుందిగా! ఆ మ్యాటర్ యే మాట్లాడుతున్నాను డాడీతో ఇప్పుడు.

ల: మళ్ళీ ఇంకొక ఫోన్ దేనికే ఒకటుందిగా ఇంట్లో. తండ్రీకూతుళ్లకి వెర్రి  తలకెక్కుతుంది, లేకపోతే ఏంటి? ఇంట్లో ఒక ఫోన్ ఉండగా మళ్ళీ ఇంకొక ఫోన్ అవసరమా? అనవసర ఖర్చు తప్ప.

శి: అక్కడే కర్రీలో లెగ్ వేశావు మమ్మీ. ఒకటి కాదు రెండు ఫోన్లు. డిస్కౌంట్ ఆఫరులో ఒకటి కొంటే మరోటి ఫ్రీ. అదే తీసుకోమని చెప్తున్నా. ఎంచక్కా నువ్వూ డాడీ కూడా సేమ్ నెట్వర్కు అయితే అప్పుడు నువ్ భయపడినట్టు ఖర్చుండదు, మనకన్నీ ఫ్రీ కాల్స్! సెల్ఫోన్ ఉంటే మనందరం పక్కనే ఉన్నట్టుగా మాట్లాడుకోవచ్చు. నీ కొడుకుతో కూడా.

ల: అయ్యో! అసలు విషయం మరిచేపోయా నీ సెల్లు గోలలో పడి. శాస్త్రి గారు అన్నయ్యకోసం రెండు సంబంధాల ఫోటోలు పంపించారు, నువ్వు కూడా చూడు. అక్కడ పుస్తకం కిందున్నాయి.    

శి: ఏంటమ్మా నువ్వు కూడా! మనకి నచ్చితే సరిపోతుందా? చూసేవారికి నచ్చక్కర్లేదా? ఎవరు బాగుంటారో అనేది  వాళ్ళే సెలెక్ట్ చేస్తారు.

ల: నువ్ చెప్తుంటే ఇందులో ఏదో తిరకాసుందనిపిస్తుంది.

శి: తిరకాసు కాదు బంగారం కాసు కాదు. సింపుల్. ఇప్పుడు చేసుకునేవాడికి అంటే అన్నయ్యకి నచ్చింది 50% మార్కులు వేసి, మిగతా 50% మార్కులకి ఆ రెండు ఛాయిస్ల మీద అన్నయ్య ఫ్రెండ్స్ కి, చూట్టాలకి, చుట్టుపక్కవాళ్ళకి ఎస్. ఎమ. ఎస్. పోల్ పెడితే సరి! అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఓటు వేసిన సంబంధం చేశామనుకో, రేపు ఎవ్వరూ కొత్తొదినకి వంకలు పెట్టరు.

(అని భుజాలేగరేసుకుంటూ చెప్తుంది శిరీష)

ల: ఆ! అలాగే!? ఇలాంటి చచ్చు పుచ్చు ఆలోచనేదో చెప్తావనుకున్నా.  ఇందులోనూ సెల్ గోలేనా! ఇదేమీ టీ.వీ. సీరియలో ప్రోగ్రామో కాదమ్మా. వేళాకోళంగా ఉందే నీకు.  

శి: కాదు మమ్మీ రెండూ ఒకటే. పెళ్ళయినా టీ.వీ. ప్రోగ్రామయినా చేసేవాళ్లకన్నా చూసేవాళ్ళకే ఎక్కువ ఇంపార్టన్స్.

ల: అసలు నిన్ను కదిపాను చూడు, నాది కదా తప్పు.

శి: సరే నీ ఇష్టం. అన్నట్టు రేపు మేం ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం కదా నీకేం తీసుకు రావాలి? గాజులు? శాలువా?

ల: అవన్నీ కాదు కానీ మీరంతా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండు.

*****

Scene – 4

శిరీష ఎక్స్కర్షన్ నుండి తిరిగి వస్తుంది. వచ్చేసరికి ఇంటికి తాళం. అమ్మ నుంచి మిస్డ్ కాల్. వెనక్కి కాల్ చేస్తుంది.

శి: ఎక్కడికెళ్ళావు మమ్మీ? తాళం ఉంది ఇంటికి!

ల: (ఫోన్లో) పిన్ని వాళ్ళింటికొచ్చానమ్మా, ఎదురింటి ఆంటీ దగ్గర తాళంచెవి తీసుకో.

(అని ఫోన్ పెట్టేస్తుంది. కాసేపయ్యాక మళ్ళీ మిస్డ్ కాల్, ఈ సారికూడా తిరిగి ఫోన్ చేస్తుంది శిరీష)

శి: చెప్పు మమ్మీ.

ల: టేబుల్ మీద అన్నీ సర్ది ఉన్నాయి, తిను.

శి: ఈ ఒక్క ముక్క చెప్పటానికి మళ్ళీ మిస్డ్ కాల్ ఇవ్వాలా?

ల: నీ ఫోన్ కి ఫ్రీ కాల్స్ కదమ్మా, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చాను.

శి: సర్లే ఎప్పుడొస్తావు?

ల: చెప్పలేనమ్మా! పిన్నితో మాట్లాడుతున్నాను. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి సరేనా. 

(ఫోన్ కట్ అవుతుంది. కాసేపయ్యాక టీవీ చూస్తుండగా మిస్డ్ కాల్ వస్తుంది, పని మనిషి నుంచి.)

శి: ఛీ బతుకు! ఆఖరికి పని మనిషి కూడా మిస్డ్ కాల్ ఇవ్వడం, విషయం తెలుసుకోడానికి నేను తిరిగి కాల్ బ్యాక్ చేయడం. ఒకటే నెట్వర్క్ అని ఉచిత సలహాలిచ్చానుగా. ఇలా నాకే తలనొప్పి అవుతుందని అనుకోలేదు.

(మళ్ళీ మిస్డ్ కాల్ వస్తుంది)

ల: అమ్మా తిన్నావా? పని మనిషొస్తే గిన్నెలు వేసేయి. 

శి:  మమ్మీ ఒక సారి వచ్చి మళ్ళీ వెళ్ళు. 

ల: సరే వస్తాను, ఈ లోపు అవసరమైతే ఫోన్ చేయి. 

శి:  అంటే అంత టైం పడుతుందా రావడానికి? త్వరగా రా!

ల: (నవ్వుతూ) సరే వస్తున్నా.

(శిరీష కోపంగా ఫోన్ విసిరిగొడుతుంది. బ్యాగు లోంచి సమన్లు తీస్తుండగా వెంకటలక్ష్మి ఇంటికి వస్తుంది.)

ల: ఏమ్మా కంగారు పెట్టేసావు?

శి: అంతే గానీ ట్రిప్ ఎలా ఉంది?ఎలా ఉన్నావ్? అని కనీసం అడిగావా?

ల: ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా, అలా అంటావేవిటి?

శి: ఫోన్లో మాట్లాడటానికి స్వయంగా మాట్లాడటానికి తేడా లేదా మమ్మీ?

ల: ఏంటమ్మా మళ్ళీ చెప్పు.

శి: అదే ఫోన్ మాట్లాడినదానికి స్వయంగా మాట్లాడటానికి తేడా ఉండడా? నేనొచ్చే సరికి నువ్వు లేకపోతే బాధేసింది. ఒక్కదాన్నే ఉన్నాను అప్పటి నుంచి. డాడీకి ఏమో ఆఫీస్ లో మీటింగ్ అంటా, కనీసం ఫోన్ చేసే ఖాళీ కూడా లేదట.

ల: చూడమ్మా నువ్ చిన్నదానివి కాబట్టి నీకనిపించింది చెప్పావు. నేను ఎప్పుడూ చెప్పలేదు. అదే తేడా. నువ్వు కాలేజీకి, నాన్న ఆఫీసుకి వెళ్లిపోతే ఎలాగూ మాట్లాడుకోలేం. కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా మాట్లాడుకుంటామా? అదీ లేదే. ఇంట్లో ఉన్నా బయటకి వెళ్ళినా ఎప్పుడు చూడు చేతిలో సెల్ ఫోన్. మమ్మీకి ఎంత బాధగా ఉంటుందో అని ఎప్పుడైనా అనిపించిందా. నాకు కూడా ఒక్కదాన్ని ఉంటే బోర్ గా ఉంటుంది, కానీ కనీసం రాత్రి భోజనం చేసేటప్పుడైనా మాట్లాడుతామా? ఎక్కడా? మనకి ఫోనులో మాటలు పూర్తయితే కదా.  

     చూడరా, ఏదైనా “అతి సర్వత్ర వర్జయేత్” అంటారు. అంటే ఏదైనా మితిమీరకుండా ఉండాలి. అతిగా ఉండేది ఏదైనా ఉపయోగం లేకుండా పోతుంది. నువ్ విసిరేసిన సెల్ ఫోన్ లాగా.

     ఫోన్ అనేది మనుషుల మాటల్ని కలపటానికే కానీ మనుషుల్ని దూరం చేసుకోటానికి కాదమ్మా.

     నువొక్క రోజు పడిన బాధ నేను నీ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుండీ పడుతున్నాను. ఏదైనా చేతిలో ఉండగానే కాపాడుకోవాలి, అది వస్తువయినా, మనిషైనా. గుర్తుంచుకో!

శి: అర్ధమైందమ్మా, ఇన్నాళ్ళూ ని బాధ పెడుతున్నానని ఎప్పుడూ అనిపించలేదు. ఇక ముందు అనవసరంగా సెల్ లో మాట్లాడను మమ్మీ.

ల:  పోన్లే కనీసం నేను చెప్పాకనైనా అర్ధం చేసుకున్నావ్.

శి:   అవును. నువ్వెక్కడున్నావ్ ఇందాకటిదాకా? పిన్నివాళ్ళ ఇల్లు చాలా దూరం కదా! ఇంత తొందరగా ఎలాగొచ్చేశావ్?

ల:  పిన్ని దగ్గరకెందుకెళ్తా? ఎదురింటి ఆంటీ ఇంట్లోనే ఉన్నను. సెల్లులో మాట్లాడితే ఎక్కడున్నా, ఇంకెక్కడో ఉన్నట్టు చెప్పచ్చుగా! అలాగే నీకూ చెప్పాను అంతే.

-శ్రీమౌక్తిక

*****


మౌక్తికీయం- పునః ప్రారంభః ... ప్రార్థన!

శ్రీ మద్రమా రమణ గోవిందో హరి... పర బ్రహ్మ పరమెశ్వర పురుషోత్తమ సదానంద.... పర... పర... (అబ్బే... వీల్లేదు, ఈ సారి పద్యం బాగా బట్టీ పట్టాలి) శ్రీ మహాగణపతి గరికి, అమ్మ-నాన్న గార్లకి, ఈ మాత్రం భాషా ప్రయోగం / ఉపయోగంచే సాహసం చేయుటకు కారకులైన గురువు గార్లకు, అంటే మాది కాన్వెంటు చదువులనమాట... ( అది Matteru... అర్ధం చేస్కోవాలి) ముందు గా ప్రణామములు ఇంతవరకు బాగా రాశనా, ఐతే వొకే! ఈ ఉపోద్ఘాతమేంటి అని ఒక కనుబొమ్మ ఎత్తి మరీ చూడకండే, ఇక్కడ నాకు రకరకాల Expressions కనపడుచున్నవి సుమీ! ఇక పొస్టుకొద్దాం ! ఈ ముందు మాటలోని రెండో వరసలో ఉన్నవారు నా ప్రియమైన స్నేహితులకు (చప్పట్లు ఆ... బాబు camera! ఇక్కడ ) వీరి ఖర్మ అనుకోకుండా, నాలోని తెలుగు కి ప్రోత్సాహం అందిస్తూ, ఈ యొక్క బ్లాగుని పునహ్ ప్రారంభించుటకు తోడ్పడిన friends కి నా ఆశీస్సులతో :) "రిబ్బన్ కట్టింగ్ జ్యోతీ ప్రజ్వలన" ఆశీస్సులు ఇవ్వా ప్రార్ధన, తిట్లు ఉంటె అవి మా వాళ్ళకి అని విన్నపం.